Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

కాంచీక్షేత్రం - కామకోటిపీఠం
(రేణు)

కామకోట్టీం పురీం కాంచీం కావేరీం చ సరిద్వరాం||

శ్రీరంగాఖ్యం మహాపుణ్యం యత్ర సన్నిహితో హరిః ||

- శ్రీమద్భాగవతం - దశమస్కంధం .76 అధ్యా. 14 శ్లోకాం. శ్రీమద్భాగవతంలో 'కామకోట్టీంపురీం' అనీ, 'కామకోటిపురీం' అనీ పాఠభేదాలలో కాంచీనగరంలోని కామకోటి ప్రశంస కానవస్తున్నది. దీనివలన ఈ పీఠం యొక్క ప్రాచీనత్వం తెలుస్తున్నది. అంతేకాక భారతదేశంలో ప్రసిద్ధికాంచిన అష్టాదశ శక్తి పీఠాలలో కూడా ముఖ్యమైన పీఠత్రయంలో కామకోటికి ప్రథమస్థానం ఇవ్వబడింది. మార్కండేయపురాణంలో కామకోటి మహిమాదర్శం ఈ విధంగా చెప్పబడినది.

''తేషు చాష్టాదశ##శ్రేష్ఠాన్యేషు పీఠత్రయం పరమ్‌ |

తత్త్ర యే కామరాజాఖ్యం ప్రథమం హి ప్రశస్యతే ||

తత్పీఠే వాగ్బవం కూటం హయగ్రీవేణ పూజితం |

జాలంధ్రాఖ్యం ద్వితీయస్తు మధ్యకూటం మనోభవం ||

భృగుణాభ్యర్చితం పీఠం జ్వాలాముఖ్యాస్తు తద్విదుః |

ఓడ్యాణాఖ్యం తృతీయంతు పరాబీజస్వరూపకం ||

తత్పీఠం కామరూపేస్తి వ్యాసేనోపాసితం సదా |

ఏవం పీఠత్రయం శ్రేష్ఠం సర్వపీఠోత్తమోత్తమం ||

ప్రాగుక్తం కామరాజాఖ్యం కాంచీక్షేత్రే హి వర్తతే |

తత్పీఠం కామరాజాఖ్యం కామకోటీతి విశ్రుతమ్‌ ||''

ఈ విధంగా పురాణప్రసిద్ధియేకాక, ప్రాచీన తమిళ గ్రంధాలలోకూడా కరికాలచోళుడు 'కామకోటి' అని 'కామకోట్టం' అని ఉదహరించినట్లు కనిపిస్తుంది. కోమకోటికి నిలయమైన కంబలభూదేవికి నాభీప్రదేశాన కాంచీ మేఖలగా బడ్డాణంగా వర్ణిస్తారు.

మోక్షదాయకమైన సప్తక్షేత్రములలో కాంచిఒకటి. భౌగోళికంగా కూడా కాంచి నాభిప్రదేశంలోనే వుంది. బెంగాలీ విశ్వనిఘంటువులో కాంచి ఒకమహాపీఠస్థానమనీ అక్కడ కామాక్షి ఆలయంలో నిలువెత్తు ఆదిశంకరుల విగ్రహం వుందనీ, అది వారి సమాధిస్థలమనీ వ్రాయబడివుంది రాజచూడామణి మఖి వ్రాసిన శంకరాభ్యుదయములో గ్రంధాంతమున, ఆదిశంకరులు కంపాతీరవాసికి కామాక్షిని అర్చించి బ్రహ్మానందం పొందారని వున్నది. దక్షాణాదిని ప్రచారంలోవున్న శంకరవిజయవిలాస మనే గ్రంథంలో కాంచీనగరంలో ఆదిశంకరులు సర్వజ్ఞపీఠం నెలకొల్పి షణ్మతస్థాపనాచార్యులయ్యారని వ్రాయబడి వున్నది. కేరళ##దేశంలో గోవిందనాథ రచితమైన శంకరాచార్య చరిత్రకు బహుళప్రచారం. దానిలో ఆదిశంకరులు తమ దిగ్విజయ యాత్రలన్నీ ముగించుకొని కాంచీనగరానికి చేరినట్లు చెప్పబడినది. ఆదిశంకరులు కైలాసంనుంచీ తెచ్చిన లింగ పంచకములో ఒకదానిని శిష్యుడు సురేశ్వరుల కిచ్చారనీ, కంచిలో శ్రీచక్రస్థాపన చేశారనీ, షణ్మతస్థాపనకూడ కంచినుంచే చేశారని స్పష్టంగా ఆనందగిరీయ శంకరవిజయంలో ఉన్నది. ఇవేకాక శివరహస్యం మార్కండేయసంహిత మొదలైన ప్రామాణిక గ్రంథాలు కూడా ఆదిశంకరులకూ కంచి కామకోటిపీఠానికి గల ఆనాది సంబంధాన్ని స్పష్టంగా వివరించినవి.

( 9 - 23 )

కామకోటి సమస్తమైన కోరికలకు అవధి, అంచు. ఈ విషయాన్ని రెండువిధాలుగా అన్వయించుకోవచ్చు. ఆ తల్లిని కామాక్షిని నమ్ముకొంటే సమస్తములైన కోరికలనూ పొందవచ్చు. పోగా కోరికల అవధిని, అవగా అంతమునూ పొందవచ్చు. అంటే కోరికలులేని నిష్కామస్థితి లభిస్తుందన్నమాట. పురుషార్థములలో కామము మూడవది. అది ధర్మార్థములకు పైది. అట్టి కామకోటి అనగా కామము మోక్షమే కదా. అట్టి మోక్షం మోక్షపురి కంచిలో నెలకొన్న కామకోటి ప్రసాదిస్తుందని పిండితార్థం. శ్రీకామకోటిని ఆశ్రయించినవారి కోర్కెలు కోటి గుణితములుగా ఫలించగలవు.

కామానాం వర్ణతాత్పర్యాత్తత్కోటి గుణసంఖ్యయా |

కామకోటీతి విఖ్యాతం కామకోష్ఠ ధరాతలమ్‌ ||

అథ కామస్తృతీయోర్థం పురుషార్థేషు విశ్రుతః |

తత్పరస్తా చ్ఛృతో మోక్షః కోటిశ##బ్దేన శబ్దితః |

కామకోటి స్మృతో మోక్షః పురుషార్థ తురీయకః ||

ఈ కామకోటి పీఠాదిష్ఠాతృశక్తి. భగవతి కామాక్షి, ఆమె కంపానదీతట విహారిణి. ఏకామ్రనాథుని కుటుంబిని. శ్రీచక్రస్వరూపిణి సకలలోకైక జనని. అమ్రతరుమూల వాసిని. ధర్మార్థకామమోక్షములనే పురుషార్థములను ఆ మామిడి చెట్టు శాఖాచతుష్టయములో నాలుగు రుచులలో పండించి అడిగినవారికి పంచిపెడుతుందట. ఆమె కటాక్షమునకు నోచుకున్న భాగ్యశాలి మూగియైననూ వాగ్మివాగలడు. అతడు శత్రుమిత్రులనూ, లోష్టమునూ యువతిబింబోష్ఠమునూ సమదృష్టితో చూడగలడు. ఆమె కరుణాస్రవంతికి అవధులు లేవు.

ఆతల్లి చల్లనిగొడుగు నీడలో ఇంద్రసరస్వతి బిరుదుతో శ్రీశంకరాచార్య పరంపర అవిచ్ఛిన్నంగా జగత్కల్యాణసంధాయకముగా నేటివరకూ ప్రవర్థమానమవుతూ లోకాన్ని కటాక్షిస్తూవుంది. ఈ పీఠాచార్యులు సరస్వతీ సంప్రదాయమునకు చేరినవారు. ఇంకొక భారతీ సంప్రదాయము మరొకటి ఉన్నది. ఆ కోవకు చెందిన స్వాములు ఎంతో మంది వున్నారు. ఈ పీఠాధిపతులకు ఈ బిరుదు లభించుటకు అనూచానంగా వస్తున్న ఐతిహ్య మొకటి ఉన్నది. ఆదిశంకరులచేత ఓడింపబడిన తర్వాత మండనమిశ్రులకు అసాధ్యమైన శిరోవేదన కలిగిందట. ఎంతచికిత్స చేసినా ఉపయోగం లేకపోయింది. తర్వాత ఆచార్యులవారి కోరికపై అశ్వినీదేవతలు వచ్చి చికిత్స చేశారట. ఇంద్రుని అనుమతి వారు పొందనిదానివలన వారిపై ఇంద్రునికి ఆగ్రహం వచ్చింది. అనంతరం పశ్చాత్తాపపడి శంకరభగవత్పాదులను ప్రశంసించి వారి ధర్మజగత్తులో తమ ఇంద్రసామ్రాజ్యాన్నీ కలుపుకోమని ఇంద్రుడు ప్రార్థించాడట. ఆనాటినుండి ఆ పీఠాధిపతులందరూ ఇంద్ర సరస్వతులని వ్యవహరింపబడుతూ వచ్చారు.

శ్రీగీర్వాణంద్రసరస్వతి, గంగాదరేంద్రసరస్వతి, పరమేశ్వరేంద్రసరస్వతి సదాశివేంద్రసరస్వతి మొదలైన యతీశ్వరు లీ ఇంద్రసరస్వతి సంప్రదాయానికి చేరిన మహిమాన్వితులు ఆదిశంకరులకు గోవింద భగవత్పాదులు ఉపదేశించిన మహావాక్యదీక్షా విధానమే ఇంద్రసరస్వతీ కోవకు చెందిన యతులకుగూడ ఆశ్రమస్వీకార సమయమున వరణీయమై యున్నది. ఈ పవిత్రమైన సంప్రదాయములో 67వ పీఠాధిపులు పూజ్యచరణులు, పరమశివస్వరూపులు శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీస్వాములు.

ధర్మసంస్థాపనతో బాటు ఈ గురుపరంపరకు చెందిన యతీశ్వరులు చేయవలసిన మరొక కార్యమున్నది. శ్రీరంగంలోని జంబుకేశ్వరాలయం కంచికామకోటి ఏలుబడిలోనిది. అక్కడి అమ్మవారు 'అఖిలాండేశ్వరి' ఆదిశంకరులు ఆమూర్తిలోని ఉగ్రకళును తీసివేసి నవరత్న ఖచితమైన శ్రీచక్రతాటంకములను ఆమె చెవులకు అలంకరించారట. అవి జీర్ణమైనప్పుడెల్లా కామకోటి పీఠాధిపతులు వెళ్ళి వానిని బాగుచేయించి అమ్మవారికి అలంకరిస్తారు. శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతులు తమ పదునాలుగవ ఏట అనగా 1908 లో అఖిలాండేశ్వరి ఆలయానికి కుంభాభిషేకం చేసి తర్వాత 1922వ సంవత్సరమున అమ్మవారి తాటంకముల జీర్ణోద్ధరణక్రతువు చేశారు. ఈ శతాబ్దిలో ఈ మహాత్కార్యం చేసిన ఘనత శ్రీవారికి దక్కినది.

శ్రీకామకోటిపీఠానికి చోళ##దేశపు ప్రభువులేకాక కర్ణాటకరాజులు విజయనగరసామ్రాట్టు కృష్ణదేవరాయలు, గోల్కొండనవాబులు, మహామంత్రులు అక్కన్న మాదన్నలు మధురనాయక ప్రభువులూ, తంజాపూరు మహారాష్ట్రపాలకులూ,ఆర్కాటు నవాబులూ, ఇతరప్రభువులు, సంపన్నూలూ, ఎందరో అగ్రహారములు, ఇనాములు కాన్కలు ఇచ్చి ధన్యులయ్యారు. వారిచ్చిన దానపత్రములు, రాగిరేకులు, శాసనములు, ఈ విషయాలను ధృవపరుస్తున్నవి.

చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీకంచికామకోటి పీఠప్రాశస్త్యమును ఈనాడు ప్రాతఃస్మరణీయులు శ్రీచంద్రశేఖరేంద్ర సంయమీంద్రులు తమ, తపః పూతమూ, పరోపకార త్యాగ సమన్వితమూ, లోకకళ్యాణ సమలంకృతమూ, జంగమ తీర్థరాజతుల్యమూ, అయిన పవిత్ర జీవితముతో కోటిగుణములు పెంపొందించుచున్నారు. గురుదేవుల శ్రీచరణములకివే మా అంజలులు.


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page